అయినా సరే; నా మౌనం మాట మారుస్తోంది. నా చూపు వెలుతురే నువ్వంటొంది. నా అడుగులు యిక గమ్యమేముంది అంటున్నాయి. పాపం అవి మాత్రం ఏం చేస్తాయ్;
పున్నమి నాటి వెన్నెలలా నా గుండెనిండా నిండిన నువ్వు,మల్లె పూల పరిమళంలా నా తనువంతా తడిపిన నువ్వు ,ఆ జాబిలే తెల్లవారుతుంటె మసక మసకగా మారినట్లు, ఆ మల్లెలే సాయం సమయాన అందమంతా వాడినట్లు అదోలా మారిపొయి, కళ్ళలోని ప్రేమను కన్నీళ్ళలో ఒంపేస్తూ, యిక మరు క్షణం ఉండదేమోనని ఆక్షణమే నన్నలుముకుంటూ, మాటలు మరిచిన మౌనంలా నిలువెల్లా వణికిపోతూ నే..నంటే...యిష్టం లేదా? అనడిగితే, నీ కన్నీళ్ళతో నా గుండెనంతా తడిపితే యిక ఏం చేయను...
గొంతులో మంటగా ఉందంటావ్. ఎందుకురా అనడిగితే నేనాపుకున్న బాధంతా అక్కడే ఉందంటావ్.
ఆ క్షణం; నీ కన్నీళ్ళలో, నువ్వు చెప్పిన గుండె మంటల్లో కరిగిన నా మనసును దోసిట్లొ పట్టి నీ పాదాల ముందు పరవాలనిపిస్తుంది.! పగలూరాత్రీ మరిచిపోయి, నీ నవ్వుల్లో నిద్రపోయి నీతోనే గడపాలనిపిస్తుంది.
జాబిలీవెన్నెల, పువ్వూపరిమళం, నీరూఆవిరి...ప్రేమికులైతే నువ్వు నేనూ అలానే అనిపిస్తుంది.
యింత చేసిన నువ్వు నన్నంతలా మార్చేసిన నువ్వే మళ్ళీమరోలా అంటావ్! నన్ను విడిచి వెళ్ళమంటావ్. నాకు దూరం కాలేవెందుకంటావ్. నువ్వు నింగి,నేను నేలా అంటావ్. మనమిద్దరం రైలు పట్టాలంటావ్.
యిక నవ్వనా...ఏడ్వనా...? ఎలా నవ్వను,ఎలా ఏడ్వను నాకూ నీలాగే గుండెలోని బాధంతా గొంతుకడ్డంపడితే...!